23 April, 2026 | 3:19 AM

స్తంభించిన ఆర్టీసీ ప్రజా రవాణా

23-04-2026 12:00 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్

బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

ఆటోలు.. క్యాబ్‌లే శరణ్యం

సికింద్రాబాద్/కుషాయిగూడ/మేడిపల్లి/ఎల్బీనగర్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగారు. దీంతో తెల్లవారు నుండే డిపోల ఎదుట కండక్టర్లు డ్రైవర్లు ఇతర కార్మికులు విధులు బహిష్కరించి కార్మికులు సమ్మెకు దిగడంతో మొత్తంగా ఆర్టీసీ, అద్దె బస్సులు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్సుల సమ్మె ప్రభావం సికింద్రాబాద్ నగరంలో తీవ్రంగా కనిపిస్తోంది.

ముఖ్యంగా జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), రేతిఫైల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన కేంద్రాల్లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది ప్రయాణికులు సమ్మె విషయం తెలియక స్టేషన్‌కు చేరుకుని గంటల తరబడి ఎదురు చూసి చివరకు నిరాశతో వెనుతి రిగారు. కొందరు తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగి వస్తూ బస్సులు లేక ఇబ్బందులకు గురయ్యారు. రెథిఫైల్ బస్ స్టేషన్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో స్టేషన్ వెలవెల బోతూ కనిపించింది. ఇదే సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు ఇరుక్కుపోయి ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇబ్బందులు పడ్డారు.

ఆటోలు.. క్యాబ్‌లే శరణ్యం..

బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలు,క్యాబ్లపై ఆధార పడ్డారు.అయితే ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కొందరు డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చాలా మం ది నడుచుకుంటూ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద భారీ రద్దీ కనిపించింది. 

బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన మహిళా కండక్టర్లు..

హైదరాబాద్, కుషాయిగూడ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కుషాయిగూడ డిపోలో బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచే డిపో వద్దకు చేరుకుని సమ్మెను కొనసాగిస్తున్నారు. డిపో నుంచి బస్సులను బయటికి పంపించే ప్రయత్నాన్ని కార్మికులు అడ్డగించి ధర్నాకు దిగారు.

కుషాయిగూడ డిపోకు చెందిన మహిళలు మహిళా కండక్టర్లు డిపో ఎదుట బతుకమ్మ ఆడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ సమ్మెలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకురాలు మంగమ్మ, జేఏసీ నాయకుడు తిరుమలరెడ్డి, కుషాయిగూడ డిపోకు చెందిన మహిళా కండక్టర్లు కౌసల్య పద్మ సుధా ఇందిరా రజిని ఉపేందర్ శ్రావణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీఆర్‌ఎస్ నేతల మద్దతు..

ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవ్వడంతో కార్మిక జేఏసీ సమ్మెకు పిలునిచ్చిన నేపథ్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్, పీర్జాది గూడ పరిధిలోని ఉప్పల్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరే టర్లు దొంతిరి హరిశంకర్‌రెడ్డి, కౌడే పోచ య్య, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, ఆకుల మధుకర్, కందుకూరి ఆంజనేయులు, బుల్లెట్ శంకర్, అశోక్ రెడ్డి, సతీష్, శ్రీ రాములు గౌడ్, అశోక్, కిరణ్ నాయక్, పగిడిపల్లి శ్రీధర్ గౌడ్, పాశం నరేందర్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

డిపోల్లో నిలిచిన బస్సులు..

ఆర్టీసీ  కార్మికుల సమ్మె నేపద్యంలో దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్ లోని డిపో 1, డిపో 2, నాగోల్‌లోని బండ్లగూడ ఆర్టీసీ డిపోలో బస్సులు డిపో దాటలేదు. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. దిల్ సుఖ్ నగర్ డిపో 115 బస్సులు ఉండగా కేవలం 18 బస్సులు మాత్రమే బయటకు వెళ్లాయి.

హయత్ నగర్ డిపో 1, మరియు డిపో 2 నుంచి సుమారు 200 ల బస్సులు నిలిచి పోయాయి. బండ్లగూడ డిపోలో సుమారు 92 బస్సులు నిలిచి పోయాయి. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు జేఏసీ నాయకుడు అశ్వత్థామ రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికులతో కలిసి వంటావార్పు నిర్వహించారు. బస్సులు కదలక పోవడంతో వివిధ పనులకోసం వచ్చిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు.

ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

జేఏసీ నేత నగేష్ పటేల్

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర ప్రభు త్వం, ఆర్టీసీ యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాలని జేఏసీ నాయకులు నగేష్ పటేల్ ఆరోపించారు.ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై యాజమాన్యం పూర్తిగా చేతులెత్తేసే దిశ గా అడు గులు వేస్తున్నది. అందులో భాగంగా సమ్మె డిమాండ్లతో తమకు ఎలాంటి సం బంధం లేదని లేబర్ కమిషన్కు పంపిన లేఖలో స్పష్టం చేసింది. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగితే తప్ప తమ సమస్యలకు పరిష్కారం లభించదని కార్మికులు భావిస్తున్నారు.

సమ్మె నోటీసు ఇచ్చి 45 రోజులు గడిచినా ప్రభుత్వం చర్చలకు పిలవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1963 చట్టం ప్రకారం సమ్మె నోటీ సు ఇచ్చామని, సమ్మెను అక్రమంగా పేర్కొనడం తప్పుడు వ్యాఖ్యలేనని స్పష్టం చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు యూనియన్ల పునరుద్ధరించాలని, 2021, 2025 వేతన సవర ణ, 2017 పీఆర్సీ బకాయిలు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సహా అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. బస్సుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్ర భుత్వం స్వయంగా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలన్నారు.