తప్పని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నాం
ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడంలేదు
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
ఎస్మాకు భయపడం.. చావో రేవో తేలిపోవాలి
మేము కొత్తగా కోర్కెలు అడగడం లేదు
మెట్రోను విలీనం చేసినప్పుడు ఆర్టీసీని ఎందుకు చేయరు?
ఆర్టీసీ జేఏసీ నేతలు వెంకన్న, థామస్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): సమ్మెను బుధవారం మొదటి షిఫ్ట్ నుంచి చేపడుతున్నామని, ఎస్మాకు భయపడమని, మరో సకలజనుల సమ్మెలా ఆర్టీసీ సమ్మెను చేపడతామని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం కనీసం సమ్మె నివారణ చర్యలు చేపట్టలేదని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం హైదరాబాద్ వీఎస్‌టీలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కోకన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బీ.యాదగిరితోపాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ తమకు అన్ని సంఘాల నుంచి మద్దతుందని, ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఆర్టీసీ విలీనం అంశాన్ని పెట్టి ప్రభుత్వం విస్మరించిందన్నారు.
తాము తప్పని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు తెస్తూ హైదరాబాద్ డిపోల్లో ఉన్న ఉద్యోగులను జిల్లాకు పంపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ముందుంచిన తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని, గత ప్రభుత్వం వేసిన కమిటీ మీకేం సంబంధమని పేర్కొన్నారు.
కాలయాపన కోసమే కమిటీ అంటున్నారని మండిపడ్డారు. మెట్రో రైల్‌ను ప్రభుత్వం వెంటనే విలీనం చేసిందని, కానీ మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఎందుకు ఇబ్బంది? అని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వలో ఎందుకు విలీనం చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్టీసీని అన్యాక్రాంతం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అని నిలదీశారు. మహాలక్ష్మి స్కీమ్‌కు ఇప్పటి వరకు ఎన్ని నిధులు విడుదల చేశారు... వైట్ పేపర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్టీని విలీనం, ఉద్యోగ సంఘాల పునరుద్ధరణ తప్ప అన్ని చేస్తాం అంటున్నారని, కమిటీ వేస్తే దాన్ని బహిర్గతం చేయాలని, అయినా గత ప్రభుత్వం కమిటీ వేస్తే..రెండున్నర ఏళ్లు ఈ ప్రభుత్వం ఏం చేసిందన్నారు. సమ్మె చేసేది కార్మికుల కోసం కాదు.. రాష్ట్ర ప్రజల కోసమన్నారు. ప్రతి నెలకు రూ.300 కోట్లు మహాలక్ష్మి నిధులు ఆర్టీసీకి ఇస్తే జీతాలకు పోను ఇంకా నిధులు మిగులుతాయన్నారు. వేల కోట్ల అప్పుల్లోకి ఆర్టీసీని నెటేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తమను కూర్చొబెట్టి మాట్లాడుతే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
ఎస్మాకు భయపడమని, ఆర్టీసీ చావో రేవో తేలిపోవాలన్నారు. స్కూల్ బస్సులు పెట్టి నడిపిస్తామంటే కుదరదని, ఆర్టీసీ కార్మికులను కన్నీళ్లు పెట్టిస్తున్నారని, ఆకలి చావులు చస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 53 రోజులు సమ్మె చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులదన్నారు. తమకు వేరే సంఘాలతో పనిలేదని, కార్మికుల్లారా సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచైనా తమ డిమాండ్లను పరిష్కరించుకుంటామని స్పష్టంచేశారు.






