24 February, 2026 | 1:07 PM

వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా

24-02-2026 01:08 AM
  1. డ్రైవర్‌తో పాటు ఆరుగురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు
  2. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది
  3. ఆదిలాబాద్ జిల్లా షాంపూర్ వద్ద ఘటన
  4. పొగమంచు కారణంగానే ప్రమాదం

ఆదిలాబాద్/ఉట్నూర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆసిఫాబాద్‌కు సోమవారం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఉట్నూర్ మండలం షాంపూర్ వాగులో బోల్తా పడింది. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆసిఫాబాద్ కు ఉదయం ఐదు గంటలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు 6:30 గంటల సమయంలో పొగమంచు కారణంగా షాంపూర్ సమీపంలోని వాగులో బోల్తా పడింది.

ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణిస్తున్నారు. గంగన్న (డ్రైవర్), రామ్ దాస్, గంగమ్మ, గోవర్ధన్, సంగీత, శంకర్, ఊషన్న లకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ ఉట్నూర్ ప్రభు త్వ ఆసుపత్రికి వెళ్లి  క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఫోన్ ద్వారా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తీవ్ర గాయాలైన వారిని రిమ్స్‌కు పంపించాలని సూచించా రు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రిమ్స్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఆర్టీసీ రీజినల్ డిప్యూటీ ఆర్‌ఎం శ్రీ హర్ష, డీఎం  ప్రతిమారెడ్డి సంఘటన స్థలా న్ని పరిశీలించారు.