రైతు సంక్షేమమే ధ్యేయంగా పటిష్ట చర్యలు
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్, మే 5 (విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మాయ గార్డెన్ లో ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెరుగుదల, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు రైతులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రాష్ట్ర గేయాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని అన్ని రకాల సబ్సిడీలు ఆర్థిక, ఆధునిక సాంకేతిక రంగంలో నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరిచే దిశగా రైతులకు మేలు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అన్నారు. రైతులు ప్రయత్నం చేయక పొతే భవిష్యత్తు లో భూమి మొత్తం నిస్థార మవుతుందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు పండించేలా రైతులు ముందుకెళ్లాలని, ఆర్గానిక్ పంటల సాగు పై రైతులు ద్రుష్టి పెట్టాలన్నారు. భూములను రక్షించి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ... ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా రైతు వారోత్సవాల కార్యక్రమాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఓకే పంట కాకుండా పంటల మార్పిడి చేయాలన్నారు. ఒకే పంటతో జరిగిన నష్టాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు. పండ్లు కూరగాయలు పూలు లతో ఆయిల్ పామ్ పంటలను కూడా పండించడం ద్వారా అధిక లాభాలను అర్జించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, కౌన్సిలర్లూ తదితరులు పాల్గొన్నారు.






