28 August, 2026 | 7:22 PM

దుమ్ము రేపుతున్న రోడ్డు పనులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం!

28-08-2026 06:31 PM

నీళ్లు చల్లే కనీస బాధ్యత కూడా లేదా..?

అధికారుల తీరుపై వాహనదారుల ఆగ్రహం

జవహర్‌నగర్,(విజయక్రాంతి): డంపింగ్‌ యార్డు కాలుష్యంతో ఇప్పటికే నరకం అనుభవిస్తున్న జవహర్‌నగర్‌ ప్రజలకు ఇప్పుడు రోడ్డు నిర్మాణ పనుల దుమ్ము మరో తలనొప్పిగా మారింది. బాలాజీనగర్‌–చెన్నాపూర్‌ ప్రధాన రహదారి నిర్మాణ పనులు సాగుతున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నా దుమ్ము నియంత్రణకు కనీసం నీళ్లు చల్లకపోవడం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో భారీగా దుమ్ము ఎగసిపడుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొద్దిదూరం ప్రయాణించాలంటేనే దుమ్ముతో ఒళ్లంతా నిండిపోతోందని వాహనదారులు వాపోతున్నారు.రోడ్డు నిర్మాణం ప్రజల సౌకర్యం కోసం చేయాల్సింది పోయి.. ప్రజలకు శాపంగా మారడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అస్తవ్యస్తంగా సాగుతున్న పనులతో ట్రాఫిక్‌ ఇబ్బందులు, దుమ్ము సమస్య మరింత తీవ్రమవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి రోడ్డుపై క్రమం తప్పకుండా నీళ్లు చల్లేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ పనుల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించేలా కాంట్రాక్టర్‌ను ఆదేశించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. లేకపోతే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళనకు సిద్ధమవుతామని వాహనదారులు, స్థానికులు హెచ్చరిస్తున్నారు.