28 August, 2026 | 9:08 PM

బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన

28-08-2026 07:10 PM

బాన్సువాడ,,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నూతన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి అధికారులు శుక్రవారం స్థల పరిశీలన చేపట్టారు. పట్టణ శివారులోని బోర్లం రోడ్డులో కల్కి చెరువు సమీపంలో భవన నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని శుక్రవారం అధికారులు సందర్శించారు.అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, జిల్లా సమగ్ర అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి సంయుక్తంగా స్థలాన్ని పరిశీలించారు.

భవన నిర్మాణానికి స్థలం అనుకూలత, అందుబాటులో ఉన్న విస్తీర్ణం, రహదారి కనెక్టివిటీతో పాటు ఇతర మౌలిక సదుపాయాలపై వివరాలు సేకరించారు.సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అవసరమైన వసతులతో భవన నిర్మాణం చేపట్టేందుకు స్థలాన్ని పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు.