21 August, 2026 | 9:56 PM

Breaking News

గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •  

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలి

21-08-2026 09:05 PM

మంథని డివిజనల్ సబ్ కోర్టు న్యాయమూర్తికి వినతిపత్రం

మంథని,(విజయక్రాంతి): దేశానికి వెలుగులు అందించేందుకు సింగరేణి బొగ్గు గనుల్లో దశాబ్దాల పాటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోల్‌బెల్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నూనె రాజేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మంథని డివిజనల్ సబ్ కోర్టు న్యాయమూర్తి అపర్ణ మల్లాదికి రిటైర్డ్ కార్మికుల తరఫున వినతిపత్రం అందజేశారు. తమ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి కనీస పెన్షన్ పెంపునకు కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా నూనె రాజేశం మాట్లాడుతూ.. సింగరేణి భూగర్భ గనుల్లో విధులు నిర్వహించడం అత్యంత ప్రమాదకరమైనప్పటికీ కుటుంబాల కోసం కార్మికులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాత్రింబవళ్లు పనిచేశారని తెలిపారు. బొగ్గును వెలికితీసి పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అందించడం ద్వారా దేశ అభివృద్ధిలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

అయితే ఉద్యోగ విరమణ అనంతరం అదే కార్మికులు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో జీవించడం బాధాకరమన్నారు. నిత్యావసర వస్తువులు, వైద్య ఖర్చులు, మందుల ధరలు భారీగా పెరిగినా పెన్షన్ మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్‌ను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ధరల పెరుగుదలకు అనుగుణంగా సవరించాల్సి ఉన్నప్పటికీ, గత 26 సంవత్సరాలుగా తగిన స్థాయిలో పెంపు జరగలేదన్నారు. చాలీచాలని పెన్షన్‌తో కుటుంబాలను పోషించలేక, వైద్య ఖర్చులు భరించలేక పలువురు రిటైర్డ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మిగిలి ఉన్న వృద్ధ కార్మికులైనా గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యను పార్లమెంటులో బలంగా ప్రస్తావించి, కనీస పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నూనె రాజేశం విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో స్పందించి రిటైర్డ్ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. దేశానికి వెలుగులు పంచిన సింగరేణి కార్మికుల వృద్ధాప్య జీవితాల్లో చీకట్లు మిగలకూడదు. కనీస పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచి వారి కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి” అని నూనె రాజేశం కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మిక సంఘం నాయకులు పోరేటి వెంకన్న, పూరెల్ల తిరుపతి, సీనియర్ న్యాయవాదులు రఘోత్తం రెడ్డి, శశిభూషణ్ కాచే, కటకం శ్రీనివాస్, చంద్రశేఖర్ రావు, కే. సదానందం తదితరులు పాల్గొన్నారు.