నీటి సమస్యలు పరిష్కరించాలని వినతి
ఘట్ కేసర్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఘట్ కేసర్ డివిజన్ పరిధిలో తీవ్ర నీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ గురువారం ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఘట్కేసర్ డివిజన్ పరిధిలో ఉన్న ఘట్కేసర్ పట్టణం, కొండాపూర్, ఎన్.ఎఫ్.సి. నగర్ లోని ప్రజలు తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందు పడుతున్నారని తెలిపారు. మిషన్ భగీరథ నీరు 2 లేదా 3 రోజులకు ఒక్కసారి ఆర్ బ్ల్యూ ఎస్ వారు నీటి సరఫరా చేస్తున్నారని తెలిపారు.
జిహెచ్‌ఎంసి లో అంతర్భాగమైన మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఘట్కేసర్ డివిజన్ లోని ప్రజలకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ ద్వారా నీటి సరఫరా చేయించుటకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి నెలలో ఘట్కేసర్ సర్కిల్ ఆఫీసు ఎదుట ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారని, వివిధ రాజకీయ పక్షాల నాయకులు వినతులు సమర్పించారని, అయినా సమస్య తీరకపోగా ఇంకా నీటి సమస్య రోజు రోజుకూ తీవ్రంగా మారుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.
డివిజన్ పరిధిలో ఉన్న మినీ మోటార్ లు ముఖ్యంగా బాలాజీనగర్ బేతనీయ చర్చి, మసీద్, ద్వారకానగర్ రాంమూర్తి ఇంటి దగ్గర, సాయిబాబా గుడి వెనక-ముత్యాలు ఇంటి దగ్గర, వేల్పుల మహేష్ ఇంటి దగ్గర, కరీంగూడ రోడ్డు మినీ ట్యాంకు వద్ద ముదిరాజ్ స్మశాన వాటిక దగ్గర కేబుల్ కట్ చేశారని వీటి అన్నింటిని మరమ్మత్తులు చేయిస్తే కనీసం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించవచ్చని పేర్కొన్నారు. ఘట్ కేసర్ డివిజన్ లో నెలకొని ఉన్న తీవ్ర నీటి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు.






