19 August, 2026 | 1:54 PM

ఎఫ్ సీఐజీఎంను కలసిన ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్స్ ప్రతినిధులు

19-08-2026 12:55 PM

కొత్త బియ్యం డెలివరీకి గోదాముల్లో స్థలం కేటాయించాలని విజ్ఞప్తి

రాక్ మూమెంట్ చేసి పాత బియ్యాన్ని తరలించాలి

ములుగు, ఆగస్టు 19 (విజయక్రాంతి): రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎఫ్ సి ఐ జిఎం అనూజ్ త్యాగిని బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా రైస్ మిల్లర్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ ఎఫ్ సి ఐ గోదాములలో కొత్త బియ్యం స్టోరేజ్ చేయటానికి స్థలాలు లేకపోవడంతో పాటు పాత బియ్యాన్ని తరలించేందుకు రాక్ మూమెంట్ సైతం చేయకపోవడం వల్ల మిలర్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. రైస్ మిల్లర్లు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని వివరించారు.

ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా ప్రతినిధుల బృందం హైదరాబాద్ కి ఎఫ్ సి ఐ జిఎం ను కలవడం జరిగిందని ఆయన తెలిపారు. మిల్లర్ల సమస్యల దృష్టిలో ఉంచుకొని వెంటనే ఎఫ్ సిఐ గోదాములల్లో స్థలాలు ఏర్పాటు అయ్యే విధంగా చూడటం తోపాటు రాక్ మూమెంట్ చేయాలని కోరినట్టు తెలిపారు. అందుకు జిఎం సానుకూలంగా స్పందిస్తూ సెప్టెంబర్ నెలలో రాక్ మూమెంట్ చేయటం తోపాటు గోదాముల్లో స్థలాల  కోసం ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చినట్టు ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ తో పాటు కార్యదర్శి సహోదర రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి బూరెల సత్యనారాయణ, కోశాధికారి ఇరుకు కోటేశ్వరరావు, మహబూబాబాద్ ప్రెసిడెంట్  కృష్ణమూర్తి, సీనియర్ రైస్ మిల్లర్ యుగంధర్, శ్రావణ్ పాల్గొన్నారు.