19 August, 2026 | 2:22 PM

నిరసనలు - అరెస్టులు! ఇస్మాయిల్ ఖాన్ గూడలో తీవ్ర ఉద్రిక్తత

19-08-2026 01:28 PM

శ్మశాన వాటిక ప్రహరీ గోడ కూల్చివేత

ఘట్ కేసర్,ఆగస్టు 19 (విజయక్రాంతి) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్,(Malkajgiri Municipal Corporation) ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడలో స్మశాన వాటిక ప్రహరీ గోడను అర్థరాత్రి వేళ కూల్చివేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇస్మాయిల్ ఖాన్ గూడలోని వసంత్ వ్యాలీ కాలనీ సరిహద్దును ఆనుకుని ఉన్న స్మశాన వాటిక ప్రహరీ గోడను మంగళవారం అర్ధరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న స్థానికులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర ఆందోళన చేపట్టారు.

 పోలీసులు, రియల్టర్ల కుమ్మక్కు

కొందరు రియల్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే అర్ధరాత్రి విద్యుత్ నిలిపివేసి, పోలీసుల సహకారంతోనే ప్రహరీ గోడను కూల్చివేశారని స్థానికులు, కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నిరసనలు - అరెస్టులు

ప్రహరీ గోడను అక్రమంగా కూల్చివేసిన బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళన చేపట్టడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలువురు నిరసనకారులను, న్యూస్ కవరేజ్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

30 గుంటల భూమి పార్కు స్థలమే

వసంత్ వ్యాలీ కాలనీలోని సదరు 30 గుంటల భూమి పార్కు స్థలమేనని, హైకోర్టు ఇచ్చి ఉన్న ఉత్తర్వుల మేరకే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో ఈ కూల్చివేతలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనతో ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామంలో ప్రస్తుతం భయాందోళనలు, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.