22 July, 2026 | 11:29 AM

వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి

22-07-2026 10:19 AM

శిథిల భవనాలు, అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు

మున్సిపల్ అధికారులతో కమిషనర్  సాయికుమార్ సమీక్ష సమావేశం

నర్సాపూర్, జూలై 22: వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పురపాలక కమిషనర్ సాయికుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా కూలిపోయే ప్రమాదం ఉన్న శిథిలావస్థ భవనాలను వెంటనే గుర్తించి, వాటి యజమానులకు మరమ్మతులు చేపట్టాలని లేదా ప్రమాదకర భవనాలను తొలగించాలని నోటీసులు జారీ చేయాలని వార్డు అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

పట్టణంలో మంచినీటి వృథాను నివారించేందుకు ప్రతి ప్రజా కుళాయికి కంట్రోల్ వాల్వ్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా పనిచేయని మోటార్లను వెంటనే గుర్తించి మరమ్మతులు పూర్తి చేయడమే కాకుండా అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి, సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు స్పష్టం చేశారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలను మరింత ముమ్మరం చేయాలని కమిషనర్ ఆదేశించారు. బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందులు, ఫాగింగ్, అవసరమైన పనిముట్లు తదితర సామగ్రిని ముందుగానే అందుబాటులో ఉంచి పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. అదేవిధంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ శ్రీ వైట్ల మధుసూదన్, టౌన్ ప్లానింగ్ అధికారి స్రవంతి, మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.