22 July, 2026 | 11:28 AM

ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు

22-07-2026 10:29 AM

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు

కొత్తగూడ మీనాక్షి స్కైలాంజ్‌ తన నివాసంలో సోదాలు

శేరిలింగంపల్లి,జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణ ట్రాన్స్‌కోలో డివిజనల్ ఇంజినీర్‌గా(Divisional Engineer) పనిచేస్తున్న ముత్యం వెంకటరమణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం ఉదయం నుంచి విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొత్తగూడలోని మీనాక్షి స్కైలాంజ్ అపార్ట్‌మెంట్‌లో(Meenakshi Skylounge Apartment) ఉన్న వెంకటరమణ నివాసంలో ఏసీబీ ప్రత్యేక బృందం ఉదయం నుంచే తనిఖీలు ప్రారంభించింది.

ఇంటిలోని ప్రతి గదిని సూక్ష్మంగా పరిశీలిస్తూ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, పెట్టుబడుల రికార్డులు, స్థిరాస్తుల డాక్యుమెంట్లు తదితరాలను సేకరిస్తున్నారు. అధికారి, అతని కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల విలువను అంచనా వేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 14 నుంచి 15 ప్రాంతాల్లో ఎనిమిది ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. వెంకటరమణకు సంబంధించిన బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.

సేకరించిన పత్రాలు, రికార్డుల ఆధారంగా ఆస్తుల విలువను నిర్ధారించిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అవసరమైతే సంబంధిత అధికారిని విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది.సోదాల్లో లభించిన నగదు, బంగారం లేదా ఇతర వస్తువుల వివరాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. తనిఖీలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన ట్రాన్స్‌కో వర్గాల్లోనూ, అధికార వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.