ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): 2028 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బెల్లంపల్లి (SC) నియోజకవర్గం ఈసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలని ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ కోరారు. ఆదివారం ఎం ఆర్ పీ ఎస్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి అసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నేటి బెల్లంపల్లి నియోజకవర్గం వరకు మాదిగల ఓటు శాతం గణనీయంగా ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క మాదిగ నాయకుడికి కూడా ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించలేదన్నారు.
ఇది కేవలం మాదిగ సమాజానికే కాదు,ప్రజాస్వామ్యానికే ఒక ప్రశ్న అని వాపోయారు. మా కుల వృత్తులైన చెప్పులు కుట్టడం, డప్పుల దరువు వంటి సంప్రదాయ సేవలతో తరతరాలుగా సమాజానికి సేవ చేశామనీ తెలిపారు. ప్రతిశుభ, అశుభకార్యంలోనూ కుల, మత భేదాలు లేకుండా అందరి పక్షాన నిలబడ్డామన్నారు. కానీ రాజకీయ అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మాదిగలను వెనక్కి నెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది పూర్తిగా సామాజిక న్యాయానికి విరుద్ధమని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఈసారి బెల్లంపల్లి నియోజకవర్గం నుండి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే అవకాశం కల్పించాలని ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేశారు. మాదిగలకు ఓటు శాతం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రాతినిధ్యం మాత్రం శూన్యమన్నారు. ఆర్థిక, రాజకీయ బలం లేదనీ, మాదిగలకు అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. సామాజిక న్యాయాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పార్టీలపై ఉందినీ గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పులియాల రవికుమార్ (రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ), రత్నం ఐలయ్య, చంద్రశేఖర్, కుమ్మరి, శ్రీను, గద్దల ధర్మేందర్, పుల్లూరి రాము, రేణిగుంట్ల శంకర్ పాల్గొన్నారు.






