21 March, 2026 | 7:41 PM

ఘనంగా రంజాన్ వేడుకలు

21-03-2026 03:45 PM

మంగపేట,(విజయక్రాంతి): రంజాన్ వేడుకలను ముస్లీం సోదరులు శనివారం ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెల ప్రారంభం నుండి నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లీం సోదరులు శుక్రవారం  సాయంత్రం నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్‌ పర్వదిన వేడుకలను జరుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కమలాపురం, మంగపేట, రాజుపేట, దోమెడ, పూరేడుపల్లి తదితర గ్రామాలలో ఉన్న మసీదులలో ఆయా ప్రాంతాల ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.

ముస్లిం సోదరులు ఉదయాన్నే లేచి పవిత్ర స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి తమ తమ సమీపంలోని ఈద్గా కు చేరుకుని ముస్లిం మత గురువుతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చెడు ఆలోచనలు, అధర్మం, అసత్యం లాంటివి నియంత్రించుకునే విధంగా ఉపవాసదీక్షలు చేసి అల్లాను కొలువడమే రంజాన్‌ మాసం ప్రాముఖ్యత అని ముస్లిం పెద్దలు తెలిపారు. ప్రజలు అంతా సుభిక్షంగా, కలిసిమెలిసి, సుఖసంతోషాలతో, మంచి ఆరోగ్యంతో జీవించాలని ప్రార్ధనలు చేసినట్లు ముస్లీం పెద్దలు తెలిపారు. హిందూ ముస్లిం భాయి భాయి అంటూ హిందూ సోదరులు సైతం ముస్లిం సోదరులు కలిసి ఆలింగనం చేసుకుని  రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.