16 April, 2026 | 2:44 AM

మొయినాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల జోరు!

16-04-2026 12:00 AM
  1.   111 జీవో గాలికి.. నిబంధనలు తుంగలోకి..
  2. పుట్టగొడుగులా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు

మొయినాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): రాజధాని నగరానికి ఆనుకుని ఉండి, పచ్చదనానికి నిలయమైన మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని భావించే సామాన్యులకు ఇక్కడ వింత అనుభవాలు ఎదురవుతున్నాయి.

నిబంధనలను అతిక్రమిస్తూ, అనుమతులు లేకుండానే భారీ భవనాలు నిర్మిస్తున్నా అధికారులు మాకేం పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 111 జీవో నిబంధనలు మొయినాబాద్లో తుంగలో తొక్కుతున్నారు.

ఎటువంటి ప్లాన్ అప్రూవల్స్ లేకుండా, సెట్ బ్యాక్స్ వదలకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు సాగిస్తున్నారు. ‘ఇక్కడ అంతా మా ఇష్టం.. మా వెనుక బలమైన శక్తులు ఉన్నాయి‘ అనే ధీమాతో నిర్మాణదారులు వ్యవహరిస్తుండటం గమనార్హం.

ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు?...

శాస్త్రీయమైన అనుమతులు, ఇంజనీరింగ్ పర్యవేక్షణ లేకుండా చేపడుతున్న ఈ నిర్మాణాల నాణ్యతపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణం మధ్యలో కుప్పకూలితే ప్రాణనష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని....ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఈ భవనాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే దిక్కెవరని స్థానికుల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.రాబోయే రోజుల్లో డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తితే వాటిని ఎవరు పరిష్కరిస్తారంటూ అనే ప్రశ్నలు మొయినాబాద్ వాసులను వేధిస్తున్నాయి.

అధికారుల మౌనం.. అక్రమార్కులకు వరం..

స్థానిక ప్రజలు అనేకమార్లు పురపాలక సంఘం అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించకపోవడం, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం వంటి చర్యలు అక్రమార్కులకు వరంగా మారాయి. మున్సిపల్ అధికారుల పరోక్ష సహకారంతోనే ఈ అక్రమ దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కమీషనర్ గారు.. ఇకనైనా స్పందిస్తారా?..

అక్రమ నిర్మాణాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా, పట్టణ ప్రణాళిక అస్తవ్యస్తంగా మారుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ కమీషనర్ మరియు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి:అనుమతులు లేని నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలి.

అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.111 జీవో నిబంధనల అమలును కఠినతరం చేయాలి. మొయినాబాద్ మున్సిపాలిటీని ప్రణాళికాబద్ధమైన పట్టణంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మరి అధికారుల మౌనం వీడి యాక్షన్ ప్లాన్ మొదలుపెడతారో లేదో వేచి చూడాలి.

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు..

మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీవో నిబంధనల ప్రకారం ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు లేవని కమిషనర్ జాకీర్ అహ్మద్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, తమ దృష్టికి వచ్చిన వెంటనే నోటీసులు జారీ చేసి నిర్మాణాలను నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు.