భద్రతకు బలమైన అడుగు
ప్రజల భాగస్వామ్యంతోనే భద్రత సాధ్యం
పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్
బెల్ట్ షాపుల నిర్మూలనతో పాటు సీసీ కెమెరాలు, లైబ్రరీ,
సమగ్ర గ్రామాభివృద్ధి
సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 15: మన ఊరు మన పోలీస్ కార్యక్రమం ద్వారా పుల్లూరు గ్రామంలో భద్రత, అభివృద్ధి రంగాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులను నిర్మూలించడం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు గ్రామంలో మంచి పరిణామంగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టారు.
గ్రామ భద్రతను పెంపొందించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, ఈ చర్యలను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ అభినందిస్తూ భద్రత పరంగా ఇది మంచి ముందడుగు అని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే యువతకు హెల్మెంట్లు పంపిణీ చేశారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మెడికల్ క్యాంప్ నిర్వహించారు. యాంటీ డ్రగ్స్ అవగాహనలో భాగంగా క్రీడా పోటీలు క్రికెట్ వాలీబాల్ నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమా లకు గ్రామ యువత నుంచి విశేష స్పందన లభించింది. డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి,సీఐ శ్రీనివాస్,ఎస్త్స్ర రాజేష్, గ్రామ సర్పంచ్ కుంచం లతా వెంకట్, ఉప సర్పంచ్ రాజేష్, గ్రామ పాలకవర్గం మహిళలు యువకులు పాల్గొన్నారు.






