లక్ష్యాన్ని దాటి ధాన్యం కొనుగోళ్లు
* జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు లక్ష్యాన్ని అధిగమించాయని కలెక్టర్ కె.హైమవతి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను 427 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,04,161 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వెల్లడించారు.97,807 మంది రైతుల నుంచి రూ.1,204 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటికే రూ.1,036 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ, మిల్లర్లతో సమన్వయం, అదనపు హమాలీలు, రవాణా వాహనాల ఏర్పాటుతో కొనుగోళ్లు సజావుగా సాగాయని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో రైస్‌మిల్లులు, గోదాములకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విజయవంతంలో సహకరించిన రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు,మిల్లర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.






