ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, మే 11 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేటలో విద్యా వారోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల తొలి రోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యా వారోత్సవాలను సమ్మర్ క్యాంప్ లో భాగంగా ఈ నెల 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
భవాని పేట తండాలో కేజీబీవీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభ, నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం విద్యా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధికి దోహదపడాలని పేర్కొన్నారు. విద్యా వారోత్సవాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలను కలెక్టర్ తిలకించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జయరాజ్, పాల్వంచ త హల్దార్ జనార్ధన్, డిఎల్పిఓ శ్రీనివాస్, మండల విద్యాధికారి, ప్రిన్సిపల్ మహిషా. డి ఈ సి ఓ సుకన్య, సంబంధిత శాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






