నిషేధిత బీటీ పత్తి విత్తనాల పట్టివేత
ఒకరి అరెస్ట్
మేడ్చల్, మే 11 (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న నిషేధిత బిటి 3 పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీం, వ్యవసాయ శాఖ అధికారులు, షామీర్పేట్ పోలీసులు సంయుక్తంగా షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 7 వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న పత్తి విత్తనాలను గుర్తించారు. వీటిని తరలిస్తున్న దాసరి శ్రీనివాసరావు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద క్వింటాలు పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందినవారు. దాసరి సూరిబాబు తో కలిసి అన్నమయ్య జిల్లా మదనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు వద్ద తక్కువ ధరకు విత్తనాలు కొనుగోలు చేశాడు.
వీటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రైతులకు ఫర్టిలైజర్ షాపులకు ఎక్కువ ధరకు విక్రయించి లాభం పొందాలని ఉద్దేశంతో ఇక్కడికి తీసుకు వచ్చినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. గతంలో కూడా నిందితుడు పై వికారాబాద్ జిల్లా యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి విత్తనాల అక్రమ రవాణా కేసు నమోదయింది. దాసరి శ్రీనివాసరావు అరెస్టు చేయగా మదనపల్లికి చెందిన శ్రీనివాసరావు, దాసరి సూరిబాబు పరారీలో ఉన్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి పర్యవేక్షణలో డిసిపి శ్రీధర్, ఎస్ ఓ టి అదనపు డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, ఇన్స్పెక్టర్ కే శ్రీనివాస్, షామీర్పేట్ ఎస్ హెచ్ ఓ ఎస్ శ్రీనాథ్, వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ రమేష్ బృందం ఈ ఆపరేషన్ నిర్వహించింది.






