13 August, 2026 | 9:26 PM

నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలి

13-08-2026 08:10 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం, శుద్ధమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు.

విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, తరగతి గదులు, భోజనశాల, వంటశాల, త్రాగునీటి వసతి, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థుల స్థాయికి అనుగుణంగా, అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలన్నారు. విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంపొందించే విధంగా బోధనా పద్ధతులను అవలంబించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పాఠశాల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పారిశుద్ధ్య చర్యలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలనీ తెలిపారు. స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అధికారులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సందర్శించి, చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కన్నెపల్లి మండల కేంద్రంలోని విద్యార్థులకు సైకిళ్లు, కుట్టుమిషన్ పంపిణీ చేశారు. పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మదాసి రమాదేవి బాల్య మిత్రురాలు ఎం.టి. రాజేశ్వరి సహకారంతో సుమారు రూ.1 లక్ష 80 వేల రూపాయల విలువ గల సైకిళ్లు, కుట్టుమిషన్ విద్యార్థులకు అందించారు. బాలికల విద్యాభ్యాసానికి సహకరించినందుకు వారిని అభిందించారు.

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, అక్కడ సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను తనిఖీ చేశారు.  విద్యతోపాటు మెనూ పౌష్టిక ఆహారం, ఆరోగ్యం పై దృష్టి పెట్టాలన్నారు.  ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను  పరిశీలించారు. నెన్నెల మండలం గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన,గ్రామసభ అంశాల వివరాలు తెలుసుకున్నారు. ఈ తనిఖీ లో ఆయన వెంట డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, జిల్లా డి.సి.ఈ.బి. కార్యదర్శి పి.మహేశ్వరరెడ్డి, ప్రధానో పాధ్యాయులు శ్రీరాములు ఉన్నారు.