మెడలో ఉండాల్సిన తాళి.. ఊరి పొలిమేరలో బండపై!
అమావాస్య వేళ మంత్రాలంటూ కలకలం
పోలీసుల వివరణతో ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులు
మంథని,(విజయక్రాంతి): మెడలో ఉండాల్సిన మంగళసూత్రం ఊరి పొలిమేరలోని బండపై ప్రత్యక్షం కావడంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్ష్మీపురం గ్రామంలో బుధవారం రాత్రి కలకలం రేగింది. శ్రావణమాసం తొలి రోజు, అందులోనూ అమావాస్య కావడంతో బండపై తాళిబొట్టు కనిపించడాన్ని చూసిన గ్రామస్తులు తొలుత తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరో మంత్రాలు చేసి తాళిబొట్టు అక్కడ పెట్టారంటూ గ్రామంలో ప్రచారం జరగడంతో విషయం సంచలనంగా మారింది.
భార్యాభర్తల చిన్న గొడవే అసలు కారణం!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని నుంచి ముత్తారం వైపు వెళ్తున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య బంగారు తాళిబొట్టు విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. తనకు బంగారు తాళి కావాలని భార్య కోరగా, భర్త మాత్రం ప్రస్తుతం రోల్డ్ గోల్డ్ తాళి సరిపోతుందని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆవేదనకు గురైన భార్య తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసి గ్రామ పొలిమేరలోని ఓ బండపై వేసినట్లు పోలీసులు తెలిపారు.
అమావాస్య కావడంతో పుకార్లు షికారు
అదే సమయంలో బుధవారం అమావాస్య కావడంతో పొలిమేరలో బండపై తాళిబొట్టు కనిపించడం గ్రామంలో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. శ్రావణమాసం తొలి రోజే ఇలా తాళిబొట్టు కనిపించడంతో కొందరు మంత్రాలకు సంబంధించిన వ్యవహారమంటూ ప్రచారం చేయడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. తాళిబొట్టు ఫొటోలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరల్ కావడంతో విషయం మరింత సంచలనంగా మారింది. ఎస్ఐ సందీప్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి అసలు విషయాన్ని వివరించారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ కారణంగానే భార్య తాళిబొట్టును తీసి అక్కడ వేసిందని స్పష్టం చేశారు. పోలీసుల వివరణతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనా.. మెడలో ఉండాల్సిన మంగళసూత్రం ఊరి పొలిమేరలో బండపై కనిపించడం, అది అమావాస్య రోజు కావడంతో గ్రామంలో కొద్దిసేపు తీవ్ర కలకలం రేపింది. చివరకు మంత్రాల వ్యవహారం కాదని పోలీసులు తేల్చడంతో ఈ సంచలనానికి తెరపడింది.






