25 July, 2026 | 8:55 PM

ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన పంటలు

25-07-2026 07:56 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి నాణ్యతతో కూడిన పంటలను సాధించాలని అశ్వారావుపేట వ్యవసాయశాఖ డివిజన్ సంచాలకులు రవికుమార్ రైతులను కోరారు. శనివారం ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లో భాగoగా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట డివిజన్ వ్యవసాయ సంచాలకులు రవికుమార్ మాట్లాడుతూ... ప్రకృతి వ్యవసాయంలో ముందుకు వచ్చిన రైతులు మూడు సంవత్సరాలు పాటు ఒక్కో రైతు ఎకరం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి నాణ్యతతో కూడిన పంట ఉత్పత్తులను సాధించాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు మాట్లాడుతూ... మట్టి నమూనాలు ఎలా సేకరించాలో వివరించారు. రైతులు తమ పొలాల్లో మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కేవీకే కోఆర్డినేటర్ భరత్ మాట్లాడుతూ ఎలి నేనో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడతాయని దీనికి అనుగుణంగా తక్కువ పంట కాలం, తక్కువ నీటిని వాడుకునే పంటలైన కంది, పెసర,మినుములు సాగు చేయాలని సూచిoచారు.

ఏఈవో రాహుల్ మాట్లాడుతూ ప్రతీ రైతు రైతుభీమా రెన్యువల్ కోసం వారి పట్టా భూమి,రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు కాపీ ని నామినేషన్ ఫార్మ్ తో ఇవ్వాలని కోరారు.సర్పంచ్ కోర్స ఆదిలలక్ష్మి మాట్లాడుతూ... రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించాలని,ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఏఈవోలు రాహుల్,రమేష్ రైతులు పాల్గొన్నారు.అనంతరం అధికారులు పత్తి, మొక్కజొన్న ఆయిల్ పామ్ పంటలను పరిశీలించారు.పంటలలో వచ్చు పురుగు తెగుళ్ళకు  సంబందించిన సస్య రక్షణ చర్యలను రైతులకి వివరించారు.