11 April, 2026 | 7:06 PM

ఖిల్లా.. చరిత్ర భళా!

19-10-2025 12:25 AM
  1. పాన్‌గల్ కోటలో అద్భుతాలెన్నో..  

1600 అడుగుల ఎత్తులో.. ఎన్నెన్నో గతవైభవ దీప్తులు

చుట్టూ దర్గాల మధ్య మైదానం.. 

చెక్కు చెదరని ఖిల్లా ప్రధాన ద్వారం.. శత్రుదుర్భేద్యమైన గోడలు.. కాకతీయుల కళాత్మకతకు దర్పణం.. రమణీయ శిల్పాలకు నిలయం.. బాలనాగమ్మ వైభవం..గడగడలాడించిన మియ్యాసావ్ కీర్తి.. ముస్లింలకు ఆరాధ్యదైవమైన ఆకర్షబ్ దర్గా.. పెద్దపెద్ద ఫిరంగులు.. ఉయ్యాల కోటలు.. గతవైభవ దీప్తులు.. యుద్ధ ఆనవాలు.. కోనేరులోని చల్లటి నీరు.. పాములా మెలికలు తిరిగే దారులు.. పక్షుల కిలకిలారావాలు.. పైనుంచి చూస్తే.. నలుదిక్కులా పల్లెల కనువిందు..  సముద్రమట్టానికి 1,600 అడుగుల ఎత్తులో.. ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. తరతరాల చరిత్రను దాచుకుని.. నేటి తరానికి సాక్ష్యంగా నిలుస్తున్న బర్లగట్టు.. ఉరఫ్ ఖిల్లాగట్టు-.. ఉరఫ్ పాన్‌గల్ ఖిల్లాగా పేరొందిన పానల్ కోట గురించి తెలుసుకుందాం పదా.. 

పికిలి రాము, వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పాన్‌గల్ మండల కేంద్రంలో ఖిల్లా కండ్లముందు కనిపిస్తూనే కడుపులో బోలెడంత చరిత్రాత్మక రహస్యాన్ని దాచుకుంది. ఖిల్లా చుట్టూ ఉండే దర్గాల మధ్య మైదానం. నవాబులు నివ సించడానికి ఏర్పాటు చేసుకున్న కోటలు, ఇక్కడ విస్తరించిన పచ్చిక, పెద్దపెద్ద చెట్లు, గుట్టలు, కాలుష్యం లేకుండా వీచే చల్లటి గాలి సందర్శకులను ఆహ్లాదపరుస్తాయి.

గుట్టపైకి ఎక్కి చూస్తే నలుదిక్కులా ఊళ్లు కనిపిస్తాయి. పాములా మెలికలు తిరిగే రహదారుల ఆకారం అభురపరుస్తుంటుంది. కోనేరులోని చల్లటి నీరు దాహార్తిని తీర్చడమే కాక స్వస్థతనూ చేకూరుస్తుంది. కారణం అందులో వనమూలికలు మిలితమై ఉండడం. కాళ్లకు కాసింత పనిచెప్పి.. ఇక్కడికొస్తే మనసు కుదుటపడిందనే అనుభూతి కలుగుతుంది.

ఈ చారిత్రక సంపద కోసం ఒకప్పుడు యుద్ధాలు కూడా జరిగాయి. ఇందుకు ఆధారాలుగా పెద్దపెద్ద ఫిరంగులను కూడా చూడొచ్చు. శిల్పసంపద, పూజించుకునేందుకు దేవుళ్లు, శిథిలావస్థలో ఉన్న ఉయ్యాల కోటలు ఇవన్నీ గతవైభవ దీప్తులు..నేటి తరానికి తరగని చారిత్రక సంపదగా నిలుస్తున్నాయి. 

ఖిల్లాలో బాల నాగమ్మ బంధీ! 

చరిత్రలో గుర్తుకొచ్చే బాలనాగమ్మ కథ.. ఈ దుర్గానికి సంబంధం ఉందని నేటికీ చెబుతుంటారు. మాయల ఫకీర్ బాలనాగమ్మ కథలో వీధి నాటకాల్లో పాన్‌గల్ ఖిల్లా ప్రస్తావన ఉంటుంది. ఈ కథతోపాటు ఈ ప్రాంతాన్ని గడగడలాడించిన మియ్యాసావ్ ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించే వారని మియాసాబ్ చరిత్ర చెబుతుంది. మియ్యాసావ్ వంశీయులు ఖిల్లా దుర్గానికి కూతవేటు దూరంలో చరిత్ర కలిగిన బారా సాహిద్ దర్గాకు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ముస్లింలకు ఆరాధ్యదైవమైన ఆకర్షబ్ దర్గా ఈ కోటలోనిదే...! ప్రతి ఏడాది పాన్‌గల్ నుంచి దర్గాకు గంధోత్సవం నిర్వహిస్తుంటారు. 

చెక్కు చదరని శ్మశానం..

చనిపోయిన వారిని ఖననం చేసిన శ్మశానం కూడా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. చనిపోయిన వారిని వరుసగా ఖననం చేసినట్లు ఇక్కడున్న ఆనవాళ్లను చూస్తే అర్థమవుతుంది. ముండ్ల గవిని అనే ప్రధాన ద్వారం నేటికీ దర్జాగా నిలబడి ఉంది. ఈ కట్టడానికి పెద్దపెద్ద బండరాళ్లను ఉపయోగించారు. దీని గోడలపై సింహం, గజ, లత శిల్పాకృతులు ఉన్నాయి. ఇలాంటి అమూల్యమైన సంపదనంతా తన గర్భంలో దాచుకున్న ఈ ఖిల్లా సముద్రమట్టానికి 1,600 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నది. 

శాశనాలు.. శిల్పాలు..

ఈ పానగల్ గట్టుపై ఉన్న ఫింరగి ఖిల్లాపై తెలుగు, కన్నడ, కొంత ఉర్దూలిపిలో శిలాశాసనం లభ్యమైంది. అయితే ఇది శిథిలమై చదవడానికి అనువుగా లేదు. ఆ శాసనంపై ఉన్న ఆధారాలతో అది బైరానాఖాన్ మూడో శాసనమని అర్థమవుతున్నట్లు చారిత్రక నిపుణులు తెలుపుతున్నారు. దీన్ని చిన్నమంత్రి అనే రచయిత చెక్కినట్లు తెలుస్తున్నది. జయభ్యుదయ శాలివాహన వర్గాలు 1540 చాంద్రమాన రౌద్రినామ మహామండలేశ్వర సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్షా వారి సుభేదారుడు బైరానాఖాన్ ముక్తి పానుగంటి బాలల్లా మీద బురుజు కట్టించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఇక్కడి శిల్పాలపై ఏనుగు, నెమళ్ల చిత్రాలు ఉన్నాయి. శ్రీ.శ 1604లో రాజమాత నివసించేందుకు వీలుగా భవంతిని నిర్మించినట్లు తెలుస్తున్నది. 1786లో నైజాం వంశీయులైన నిజాం అలీఖాన్ బహుదూర్ కోటలో కొంత కాలం నివసించినట్లు తెలుస్తున్నది. అలంపూర్, జటప్రోలు, నందివడ్డెమాన్, కోయిలకొండ, ఖిల్లా ఘణపురం మాదిరిగానే ఇక్కడ కూడా నవాబులు వైభవంగా పాలించారు.

పుష్కరిణిలో నీటిమట్టం ఎప్పుడూ ఒకే స్థాయిలో..

రామగుండం ఖిల్లాలో పడమటి దిశగా ఉండే పుష్కరిణిలో నీటి మట్టం ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుంది. ఆ పక్కన ఓ చిన్నగుడిలో సీతమ్మ, రాములవారి పాదాలను చెక్కారు. ఇక్కడ కూడా నీటిమట్టం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి రామగుండంలో స్నానాలు చేసి, సీతమ్మ పాదాలకు మొక్కులు చెల్లించుకుంటుంటారు.

యుద్ధాలు ఇక్కడ రెండు సార్లు జరిగినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. 13వ శతాబ్దంలో బహుమని సుల్తాన్ కులీకుతుబ్షా విజయనగర సేనలను ఓడించారని పలువురు చెబుతారు. మరోసారి క్రీ.శ 1417లో గోల్కొండ పరిపాలకుడు ఫిరోజ్ ఓడిపోయినట్లు శిలా శాసనలు విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న పది బురుజులపై ఫిరంగులు ఏర్పాటు చేయగా కొన్ని శిథిలమయ్యాయి.

గుప్తనిధుల కోసం తవ్వకాలు, రాజుల పాలనలో దాచి ఉంచిన నగలు, బంగారం, వజ్రాలు దొరుకుతాయనే అత్యాశతో ఖిల్లాపై ఉన్న కట్టడాలను కొందరు నిరంతరం తవ్వుతున్నారు. దీంతో శిల్పాలు, విలువైన కట్టడాలు శిథిలమయ్యాయి.

పడమటి వైపున ఓ ఫిరంగిని కిందికి తోసేసినట్లు కనిపిస్తున్నది. చుట్టుపక్కల పండే వేరుశనగ పంటపై దాడిచేసే పందులు, ఎలుగుబంట్లు ఇక్కడ ఆవాసం ఏర్పర్చుకున్నట్లు గుర్తులున్నా యి. అప్పట్లో పేరెన్నికగన్న పానల్ మియ్యాసావ్ తన దోపిడీకి ఈ భిల్లానే వేదికగా చేసుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.