పుణె ప్రొఫెసర్ మనీషా అరెస్ట్
- ‘నీట్’లీక్ కేసులో కీలక మలుపు
- ఇప్పటికే అరెస్టున పీవీ కులకర్ణి విచారణలో మనీషా వివరాలు వెల్లడి
- సీబీఐ అదుపులోకి ౯వ నిందితురాలు
- జీవశాస్త్ర ప్రశ్నల లీకేజీలో ఆమే బాధ్యురాలు
ముంబై, మే ౧౬: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం తొమ్మిదో నిందితురాలు ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మాంధరేను అదుపులోకి తీసుకుంది. శుక్రవారం అరెస్టున ప్రొఫెసర్ పీవీ కులకర్ణి వెల్లడించిన ఆధారాలతో సీబీఐ ఆమెను మహారాష్ట్రలోని పుణె నగరంలో అరెస్ట్ చేసింది. డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. నిందితురాలు పుణెలోని మోడరన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నది.
ఐదారేళ్ల నుంచి ఆమె నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నియమించిన పేపర్ సెట్టింగ్ కమిటీలో సభ్యురాలిగా కొనసాగుతున్నది. వృక్షశాస్త్ర ప్రొఫెసర్ అయిన ఆమె జీవశాస్త్రంలో ప్రశ్నల లీక్‌కు ప్రధాన సూత్రధారి అని విచారణలో ప్రాథమికంగా తేలింది. ఎన్టీఏ అప్పగించిన బాధ్యతల్లో ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలు కూడా ఉండటం వల్ల ఆమె పూర్తి ప్రశ్నాపత్రం చూసే అవకాశం కలిగిందని సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు.. పేపర్‌పై పూర్తి అవగాహన వచ్చాక, గత నెలలోనే పుణెలోని తన స్వగృహంలో కొంతమంది విద్యార్థులకు రహస్యంగా నీట్ కోచింగ్ క్లాసులు నిర్వహించిందని కూడా గుర్తించారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లో ఆయా ప్రశ్నలను టిక్ చేయించారని తేల్చారు.
అందుకు ప్రతిగా విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేసినట్లు గుర్తించారు. రహస్య తరగతులు నిర్వహించేందుకు మనీషా వాగ్మారే అనే మహిళ ఆమెకు సహకరించిందని తెలిపారు. అయితే.. వాగ్మారే ఈనెల ౧౪వ తేదీనే అరస్టుంది. కెమిస్ట్రీ ప్రశ్నలను లీక్ చేసిన ప్రొఫెసర్ కులకర్ణి కూడా మనీషా మాంధరే అవలంబించిన పద్ధతినే ఉపయోగించడం, అతనికి కూడా మనీషా వాగ్మారేనే సహాయం అందించినట్లు విచారణలో వెల్లడైంది. కులకర్ణి, మనీషా వాగ్మారేను శనివారం సీబీఐ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టి, పూర్తి విచారణ కోసం 14 రోజుల కస్టడీ కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించి కస్టడీకి అప్పగించింది. సీబీఐ మొత్తంగా ఈ కేసులో పుణె, ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్ వంటి నగరాలను జల్లెడ పట్టి ఇప్పటివరకు ౯ మందిని సిబిఐ అరెస్ట్ చేసింది.






