రేపటి నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమీక్ష
ప్రతి అంశానికి ఒక నోడల్ అధికారి పర్యవేక్షణ
ఆదిలాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటిడిఎ పీఓ యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌లతో కలిసి ఆయన ఈ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమా లపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ 99 రోజుల కార్యక్రమం 10 ప్రధాన అంశాల ఆధారంగా సాగుతుందని, ప్రతి అంశానికి ఒక నోడల్ అధికారి పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. మార్చి 6 నుండి 15 వరకు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలలో పారిశుధ్య డ్రైవ్ పెండింగ్ ఫైళ్ల పరిష్కార కార్యక్రమం చేపట్టాలని, మార్చి 12న కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ 2వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వ హించి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను చదివి వినిపించాలని తెలి పారు. గ్రామ స్థాయి ఏప్రిల్ 2న, మండల స్థాయి ఏప్రిల్ 16న, నియోజకవర్గ స్థాయి మే 2న, జిల్లా స్థాయి మే 22న రాష్ట్ర స్థాయిలో జూన్ 2న, ఇలా ఐదు దశల్లో నిర్వహించబడుతుందన్నారు. రైతులకు సోలార్ కనెక్షన్ల ప్రయోజనాలు వివరించడం, పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పరిశీలన, మహిళా శిశు సంరక్షణ పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాము లై విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ, డిఆర్డీ ఓ రవీందర్, ఆర్డీఓ స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




