29 June, 2026 | 10:02 PM

మంథని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన

29-06-2026 08:43 PM

బెల్ట్ షాపులపై ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ

సమాచారం ఇచ్చిన వారి వివరాలు లీక్ చేస్తున్నారంటూ సీతంపేట సర్పంచ్ భర్త ఆరోపణ

మంథని,(విజయక్రాంతి): గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై పలుమార్లు సమాచారం అందించినప్పటికీ ఎక్సైజ్ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తూ ముత్తారం మండలంలోని సీతంపేట సర్పంచ్ భర్త ఇండ్ల సదయ్య సోమవారం ఎక్సైజ్ సీఐ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజల సౌకర్యార్థం అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలనే ఉద్దేశంతో పలుమార్లు ప్రొహిబిషన్ సీఐకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే అధికారులు స్పందించడమే కాకుండా, సమాచారం గోప్యంగా ఉంచాల్సిన బాధ్యతను విస్మరించి, ఫిర్యాదు చేసిన వారి వివరాలను సంబంధిత వైన్ షాపు నిర్వాహకులకు చేరవేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నిసార్లు ఫోన్ చేసినా సంబంధిత సీఐ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, దీంతో ఫిర్యాదులు చేసే వారిలో భయాందోళనలు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వారిపైనే కక్షసాధింపు చర్యలకు అవకాశం ఏర్పడుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించి, ఫిర్యాదు చేసిన వారి గోప్యతకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.