8 July, 2026 | 1:12 AM

విధుల్లో వృత్తి నైపుణ్యం అవసరం

08-07-2026 12:11 AM

వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత

వరంగల్ (మహబూబాబాద్) జులై 7 (విజయక్రాంతి): పోలీసులు తమ విధుల్లో అత్యుత్తమంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడం ఎంతో కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే  భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను మంగళవారం పోలీస్ కమిషనర్ మామూనూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రారంభించారు.

భద్రాద్రి జోనల్ పరిధిలోని  వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఖమ్మం పోలీస్ కమీషనరేట్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది  డ్యూటీ మీట్ లో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్ లిఫ్టింగ్, ప్యాకింగ్, హ్యాండ్లింగ్,బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ వంటి విభాగాల్లో సిబ్బంది తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ డ్యూటీ మీట్లు అధికారులకు తమ నైపుణ్యాలను మెరుగుపర్చే అవకాశం కల్పిస్తాయని,  నేరాలను త్వరితగతిన ఛేదించేందుకు, సాక్ష్యాలను శాస్త్రీయంగా విశ్లేషించేందుకు, ప్రజలకు న్యాయం అందించేందుకు ఈ వృత్తి శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు డీసీపీ లు బాలస్వామి, శ్రీనివాస్ తో పాటు జోనల్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.