పశువుల కొట్టం మాదిరి ప్రైవేట్ పాఠశాల.!
- అపరిశుభ్రత, రేకుల షెడ్డులో విద్యార్థులు.
- విద్యార్థులకు శాపంగా అధికారుల నిర్లక్ష్యం.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శాపంగా మారింది. తమ పిల్లల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న లక్ష్యంతో అప్పు చేసి మరీ ప్రైవేట్ పాఠశాలకు పంపితే రేకుల షెడ్డు, బురద ప్రదేశాల్లో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూరా మురుగు నీరు, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, పాడుబడిన వాహనాల మధ్య విష సర్పాలు ఎప్పుడు దాడి చేస్తాయో అన్న భయంతో కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. ప్రతి ఏటా ప్రైవేట్ పాఠశాల అనుమతుల కొరకు జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు జరిపి నిబంధనలు పాటించిన వారికే అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
కానీ ఎలాంటి నిబంధన లేకపోయినా పశువుల కొట్టంలో మూగజీవాలను బంధించిన విధంగా విద్యార్థులను అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రమాదకరమైన స్థాయిలో రేకుల షెడ్డులో చదువులు కొనసాగిస్తున్నప్పటికీ ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వారం రోజుల క్రితం అదే పాఠశాలకు చెందిన మూడవ తరగతి విద్యార్థి ప్రమాదవశాత్తు జారి కిందపడి తీవ్రంగా గాయపడినప్పటికీ విద్యాశాఖ అధికారులకు తమకేమీ తెలియదని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలోని ప్రైవేట్ పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. రేకుల షెడ్డు గదుల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఆ విద్యార్థులను తరలించేందుకు కూడా ఫిట్నెస్ లేని వాహనాలు వినియోగిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిడుతున్నారు. ఈ విషయంలో విద్యార్థి సంఘాల నాయకులు కూడా కిమ్మనకుండా ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇదే విషయంపై మండల విద్యాధికారి ఉమాదేవిని వివరణ కోరెందుకు సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడం కొసమెరుపు.






