30 June, 2026 | 2:04 AM

అన్ని రంగాలకు ప్రాధాన్యత

30-06-2026 12:00 AM

రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురు మామిడి, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి అన్ని రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం చిగురు మామిడి మండలం ఓగులాపూర్ లో 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వివో మహిళా సమైక్య భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మహిళా సమైక్య భవనం కేవలం ఒక భవనం మాత్రమే కాదని, గ్రామ ప్రజల ఐక్యతకు, మహిళల సాధికారతకు, గ్రామాభివృద్ధికి ఒక కేంద్ర బిందువుగా నిలవబోతోందన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, శిక్షణా తరగతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, గ్రామాభివృద్ధికి సంబంధించిన సమావేశాలు ఇకపై ఒకే చోట నిర్వహించుకునే అవకాశం ఈ భవనం ద్వారా కలుగుతుందన్నారు.

ఈ సమైక్య భవనం గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ ఉపయోగపడేలా అందరూ కలిసి పరిరక్షించాలని సూచించారు. ఒగులాపూర్ గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వం తన వంతు సహకారాన్ని అందిస్తుందన్నారు. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  ఈ భవనం నిర్మాణానికి స్థలం విరాళం ఇచ్చిన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్ లు, వివిధ విభాగాల అధికారులు, గ్రామ మహిళా సమైక్య సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.