ఉత్సాహంగా 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' 2K రన్
ఆరోగ్యమే మహాభాగ్యం నిత్య వ్యాయామం సంపూర్ణ ఆరోగ్యం: చైర్మన్ బాధుక లావణ్య దేవేందర్
షాద్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, నేడు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన 2K రన్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. స్థానిక పాపిరస్ పోర్ట్ (Papyrus Port) నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తూరు మున్సిపల్ చైర్మన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలాజీ,స్థానిక కౌన్సిలర్లు జే సుదర్శన్ గౌడ్, హేమ దేవేందర్, కోస్గి శ్రీను, సొమ్ల నాయక్, మాధవి గోపాల్,మున్సిపల్ అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం ప్రజాప్రతినిధులే కాకుండా, పట్టణంలోని చిన్నారులు, యువకులు సైతం ఉదయాన్నే రోడ్లపైకి వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ పరుగులో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ... నేటి యాంత్రిక జీవనంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనివార్యమన్నారు.
ప్రతిరోజూ ఉదయం వ్యాయామం, యోగా లేదా పరుగు వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని, ప్రస్తుత కాలంలో కల్తీ ఆహారం పెరిగిపోతోందని, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కల్తీ ఆహార ప్రభావం నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఫిట్‌నెస్ అనేది ఎంతో కీలకమని ఆమె తెలిపారు. ఈ విన్యాసాల ఆనంతరం రన్ లో పాల్గొన్న వారికి కుంగ్ ఫు కరాటేలో పాల్గొన్న విద్యార్థిని యువకులకు ప్రజా ప్రతినిధులు బహుమతులు అందచేశారు.




