10 March, 2026 | 8:30 PM

ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం

10-03-2026 06:46 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

గద్వాల,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజులపాటు దిగ్విజయంగా నిర్వహించేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో కీలకమైనదని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 12వ తేదీన స్థానిక సంస్థల, ఇతర ప్రజాప్రతినిధులతో నిర్వహించు శిక్షణ కార్యక్రమంపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు పాలనపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగేందుకు 99 రోజుల ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 12వ తేదీన ప్రజాప్రతినిధులకు నిర్వహించు శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.  ఈ కార్యక్రమం నిర్వహణపై ఇప్పటికే షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని, దాని ప్రకారం జూన్ 12వ తేదీ వరకు ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని సిఎస్ పిలుపునిచ్చారు. 

గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఈనెల 12న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ఈ శిక్షణ తరగతుల్లో ఉదయం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పది థీమ్ లను వివరించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై తెలియజేస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి వివిధ సంక్షేమ పథకాలు పొందుతున్న వారి సంఖ్య, ఇతర వివరాలన్నీ క్రోడీకరించడం జరుగుతుందన్నారు.

ఆయా అంశాలను సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా పనిచేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఈనెల 12న ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణా తరగతులను విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల కార్యక్రమాన్ని ఆయా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేసినందున దాని ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. శిక్షణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ (రెవిన్యూ), నర్సింగరావు (స్థానిక సంస్థలు), అదనపు ఎస్పి శంకర్, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.