2 April, 2026 | 6:31 PM

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు విజయవంతం

02-04-2026 04:15 PM

నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ సభలు మండలంలోని బొల్లారం,ఆత్మకూర్, మాసన్పల్లి,జలాల్పూర్, తాండూర్,గోపాల్పేట్, నాగిరెడ్డిపేట వివిధ గ్రామాల్లో సర్పంచుల అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించబడింది.99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జరిగిన ఈసభలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,రూ.500కే గ్యాస్ సిలిండర్,సన్న రకం వడ్ల కొనుగోలు,పెన్షన్లు, గృహజ్యోతి,కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్,కొత్త రేషన్ కార్డులు తదితర పథకాలపై విస్తృతంగా చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో నాగిరెడ్డిపేట్ మండలం అభివృద్ధి దిశగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రశంసించారు.

స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించగా,రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పలు గ్రామాల్లో చేపట్టవలసిన ముందస్తు చర్యలపై ప్రజలతో చర్చించారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని తీర్మానించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ... ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రతి అర్హుడికి పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఆరోగ్యం, పరిశుభ్రత,విద్య,ఉపాధి, క్రీడలు,మహిళా–శిశు సంక్షేమం,పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.