23 March, 2026 | 11:58 AM

ప్రెస్ రిపోర్టర్లమని చెప్పి టిప్పర్ డ్రైవర్లను బెదిరించి.. డబ్బుల దోపిడీ

23-03-2026 12:00 AM

షాద్‌నగర్ మార్చి 22 (విజయక్రాంతి)షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెస్ రిపోర్టర్లమని చెప్పుకుంటూ టిప్పర్ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదు అయింది. పట్టణ సీఐ కే. సీతారాం తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 22, 2026న గంగ బియాన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.విట్యాల గ్రామ పరిధిలోని ఒక పొలంలో గుట్టను చదును చేసే పనులు జరుగుతుండగా,

అక్కడి నుంచి మిగిలిన మట్టిని టిప్పర్లలో లోడ్ చేసి షాద్నగర్ వైపు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పీర్లగూడ సమీపానికి రాగానే రెండు బైకులపై వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా వచ్చి టిప్పర్లను ఆపారు. అక్కడితో ఆగకుండా, తాము ఆంధ్రజ్యోతి ప్రెస్ డిపార్ట్మెంట్కు చెందినవారమని చెప్పి టిప్పర్ డ్రైవర్లను బెదిరించారు.

రూ.20 వేల డిమాండ్ చేస్తూ, డబ్బులు లేవని చెప్పినా వినకుండా డ్రైవర్లను దుర్భాషలాడి, చేతులతో దాడి చేసి వారి వద్ద ఉన్న రూ.5,500 నగదును లాక్కున్నారు.డ్రైవర్లు తమ యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించేందుకు ప్రయత్నించగా, వారిలో ఒకరు ఫోన్ లాక్కొని, తాము ప్రెస్ వాళ్లమని, వాహనాన్ని సీజ్ చేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం టిప్పర్ను అక్కడి నుంచి తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి, రూ.20 వేలును ఫోన్పే ద్వారా చెల్లిస్తేనే వదులుతామని బెదిరింపులకు దిగినట్లు వెల్లడైంది.ఈ ఘటనలో రాజు యాదవ్, జంగయ్య అలియాస్ జగన్ పేర్లు తెలిసినట్లు ఫిర్యాదుదారు పేర్కొనగా, ఫిర్యాదు ఆధారంగా షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.