10 April, 2026 | 3:21 AM

పుదుచ్చేరిలో 89.81 శాతం పోలింగ్

10-04-2026 01:35 AM

అస్సాంలో 85.38, కేరళలో 78.01 శాతం నమోదు

చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం

మరో నాలుగు స్థానాల్లో ప్రశాంతంగా ఉప ఎన్నికలు

అస్సాం/కేరళ/పుదుచ్చేరి,ఏప్రిల్9: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల కు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మూడు రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో సమయం మించిపోయినా అప్పటికే ఓటర్లు క్యూలో ఉండటంతో వారికి ఓటువేసే అవకాశం కల్పించారు.

అత్యధికంగా పుదుచ్చేరిలో 89.81 శాతం ఓటింగ్ నమోదు కాగా, అస్సాంలో 85.38శాతం, కేరళలో 78.01శాతం నమోదైంది. అస్సాంలో ఎన్నికల సంబంధిత హింసాకాండలో సుమారు 30 మంది గాయపడగా, ఏడుగురిని అరెస్టు చేశారు. శ్రీభూమి జిల్లాలోని పాతర్కండిలో కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో సుమారు 25 మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పుదుచ్చేరిలోని మన్నడిపేటలో ఒక పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు గుంపుపై లాఠీఛార్జ్ చేశారు. కేరళలో పినరయి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తుండగా, అస్సాంలో హిమంత మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా ఉన్నారు.

పుదుచ్చేరిలో ఎన్. రంగ స్వామి ఐదోసారి అధికారాన్ని చేపట్టాలని చూస్తున్నారు. అస్సాం 126, కేరళ 140, పుదు చ్చేరి 30 మొత్తం 296 స్థానాలకు గాను పోలింగ్ జరిగింది. అస్సాంలో బీజేపీ, కాంగ్రె స్, కేరళలో లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ, పుదు చ్చేరిలో ఎన్డీయే, డీఎంకే కూటముల మధ్య పోటీ నెలకొంది. మే 4న ఫలితాలను ప్రకటిం చనున్నారు. కాగా మరో మూడు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరిగాయి. నాగాలాండ్‌లోని కోరిడాంగ్, త్రిపురలోని ధర్మనగర్, కర్ణాటకలోని బాగల్‌కో ట్, దావణగిరె సౌత్‌లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించారు. ఈ నియోజకవర్గాలలో సిట్టిం గ్ ఎమ్మెల్యేలు మృతి చెందడంతో ఎన్నికలు నిర్వహించారు.