2 September, 2026 | 4:26 PM

వనపర్తిలో రాజకీయ వాగ్వాదం

02-09-2026 | 03:08pm

అభివృద్ధి, ప్రాజెక్టులపై సవాళ్లు

2389 కోట్లతో అభివృద్ధి చేశాం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

ఆత్మపరిశీలన చేసుకోవాలి: డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే మేఘారెడ్డి పెరుగుతున్న ప్రజాదరణను చూసి మాజీ మంత్రి నిరాశతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మరోవైపు, తెలంగాణ ఉద్యమం, సాగునీటి ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం, కేఎల్ఐ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఎవరు ఎంత మేర సహకరించారనే విషయంపై ప్రశ్నలు సంధించారు.

ఉద్యమంలో పాల్గొన్న వారికి గుర్తింపు, పదవులు, సహాయం అందించడంపై మాజీ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై విమర్శలు చేయడం కంటే ప్రాజెక్టుల అంశంపై బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి కి ఆయన సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందాయా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు, వెలిగొండ ప్రాజెక్టు అంశాలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

2389 కోట్లతో అభివృద్ధి చేశాం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రకటించారు. అప్పులపై వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో రూ.2,389 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఆరు గ్యారంటీల అమలుకు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు.

గత 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. కేఎల్ఐ ప్రాజెక్టులో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదన్న ఆరోపణలను ఖండించిన ఆయన, గతంలో చిన్నారెడ్డి హయాంలో డీ-5, డీ-8తో పాటు బుద్దారం ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాల కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

కర్నె తండా, బుద్దారం, ఖిల్లా ఘనపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలోని వేలాది ఎకరాలకు సంబంధించిన పనుల్లో మిగిలిన వాటిని తమ ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, భూసేకరణ, కమిషన్ల ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలపై కూడా ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని, అవసరమైతే బహిరంగంగా చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఆత్మపరిశీలన చేసుకోవాలి: డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఎందుకు ఆవేశానికి గురవుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి సూచించారు. మేధావులమని చెప్పుకునే వారు ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయాలని ఆయన హితువు పలికారు . రాష్ట్ర బడ్జెట్‌లో గత ప్రభుత్వ అప్పులు చెల్లిస్తూనే ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం, సాగునీటి రంగంపై భారీగా ఖర్చు చేస్తోందని తెలిపారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కేఎల్ఐ పనులపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

గత పదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన ఆయన, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీతో పాటు విద్యా రంగంలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. 10 ఏళ్ల అభివృద్ధి వర్సెస్ వెయ్యి రోజుల పాలనపై చర్చకు రావాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గ ప్రజలకు వివరించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.