గంజాయి విక్రయిస్తున్న యువకులను పట్టుకున్న పోలీసులు
తూప్రాన్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): తూప్రాన్ జాతీయ రహదారి నర్సాపూర్ బ్రిడ్జి సమీపంలో సుమారు 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తూప్రాన్ పట్టణం నేషనల్ హైవే-44 పై నర్సాపూర్ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను తూప్రాన్ పోలీసులు తనిఖీ చేయగా, వారి వద్ద సుమారు 100 గ్రాముల గంజాయి లభించింది. పట్టుబడిన వ్యక్తులు అలావుద్దీన్, లవకుష్. వీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువకులుగా గుర్తించారు. వీరు శభాష్‌పల్లి ప్రాంతంలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.
ఉత్తరప్రదేశ్ నుండి కంపెనీకి తిరిగి వస్తున్న సమయం లో తమ వెంట గంజాయిని తీసుకు వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులపై ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు, ఎవరి వద్ద నుంచి పొందారు, ఎవరికి సరఫరా చేయడానికి తీసుకువచ్చారు, అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తెలిపారు.






