27 May, 2026 | 1:37 AM

అక్రమ ఫైనాన్స్ దందాలపై పోలీసుల దాడులు

27-05-2026 12:00 AM
  1. అధిక వడ్డీలతో ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు..
  2. అనుమతులు లేకుండా ఫైనాన్స్,వడ్డీ వ్యాపారం చేస్తే కేసులు నమోదు: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

సిరిసిల్ల, మే 26 (విజయక్రాంతి )జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై మంగళవారం రోజున ఉదయం పోలీసులు 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈతనిఖీల్లో అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి రూ.1,39,65,000/- విలువ గల వివిధ డాక్యుమెంట్లు, 1,77,000 విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమకున్న అత్యవసర పరిస్థితి,తాత్కాలిక అవసరాల కోసం అధిక మొత్తం అవసరాలకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆ తరువాత అప్పులు,అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయవద్దని ఎస్పీ కోరారు.

ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని,అలాగే స్థానిక పోలీసు వారికి పిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరించారు.