16 May, 2026 | 3:40 AM

బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీస్ చెక్‌పోస్టుల ఏర్పాటు

16-05-2026 01:32 AM

తనిఖీలను ముమ్మరం 

కరీంనగర్ క్రైం, మే15(విజయక్రాంతి):రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నివారణే ధ్యేయంగా సరిహద్దు ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచడంతో పాటు విధుల్లో ఉండే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల మౌలిక వసతులు, భద్రతా పరికరాలను సమకూర్చుతున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే కరీంనగర్ పరిధిలోని మగ్దూంపూర్ చెక్పోస్టును సీపీ క్షేత్రస్థాయిలోపరిశీలించారు. అక్కడ లైట్ రిఫ్లెక్టర్ జాకెట్లు, సరిపడా లైటింగ్ వసతి మినహా మిగిలిన రక్షణ పరికరాల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందిస్తూ తనిఖీలలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా శనివారం నుండి ప్రతి చెక్పోస్టు వద్ద అన్ని రకాల వసతులను విధిగా అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను సీపీ ఆదేశించారు.

ఇకపై ప్రతి చెక్పోస్టు వద్ద రాత్రి వేళల్లో తనిఖీల కోసం 3 టార్చ్ లైట్లు, వాహనాలను నిలిపివేసేందుకు మరియు సిబ్బంది రక్షణ కొరకు 3 ఎల్‌ఈడీ బాటన్లు, అత్యవసర అలర్ట్ల కోసం సిబ్బంది వద్ద విజిల్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. వీటితో పాటు చెక్పోస్టుల గుండా వెళ్లే ప్రతి వాహనం మరియు వ్యక్తుల కదలికలను నిరంతరం రికార్డ్ చేసేందుకు వీలుగా 2 సీసీటీవీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేసి పక్కా నిఘా ఉంచాలని ఆదేశించారు.