9 May, 2026 | 4:31 PM

రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!

09-05-2026 03:09 PM

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) రేపు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో రూ. 9,400 అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పూర్తియిన ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. వరంగల్ లో  పీఎం మిత్ర పార్క్ ను ప్రారంభించనున్నారు. జహీరాబాద్ లో పారిశ్రామిక ప్రాంతానికి, నాలుగు వరసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

గుడెబెల్లూర్, మహబూబ్ నగర్ మధ్య165 కిలో మీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్(Indian Oil Greenfield Terminal) ను జాతికి అంకితం చేయనున్నారు. హైదరాబాద్ మల్కాపూర్ లో ఇండియన్ ఆయిల్ గ్రీన్ ఫీల్డ్ టెర్మినల్ నిర్మించారు. సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధాని ప్రారంభిస్తారు. హైదరాబాద్ కార్యక్రమాల తర్వాత ప్రధాని మోదీ బెంగళూరుకు పయనం కానున్నారు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవానికి(Art of Living's 45th-anniversary celebrations ) ప్రధానమంత్రి హాజరుకానున్నారు.

మోదీ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లతో భాగ్యనగరం కాషాయమయమైంది. తెలంగాణ బీజేపీ నేతలు మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభా ప్రాంగణంలో జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోదీ టూర్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నగర పర్యటన, ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభ దృష్ట్యా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను విధించారు.