5 August, 2026 | 10:18 AM

గంజాయితో పాటు మొక్కలు స్వాధీనం

05-08-2026 09:05 AM

మహారాష్ట్ర వాసి అరెస్ట్

 జైనథ్ సీఐ శ్రావణ్

బేల, (విజయక్రాంతి) : మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు జైనథ్ సీఐ శ్రవాణ్ తెలిపారు. మంగళ వారం సాయంత్రం బేల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా బేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై మధు కృష్ణకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. పోలీసు వాహనాన్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన భీమా గోవింద్ ఆత్రంని అదుపులోకి తీసుకొని, సోదా చేయగా అతని వద్ద 10 గ్రాముల ఎండిన గంజాయి లభించిందని, నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్రలోని అతని వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 14 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను పెంచుతూ, వాటిని ఎండబెట్టి మహారాష్ట్రతో పాటు తెలంగాణలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బేల ఎస్సై మధు కృష్ణ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.