26 March, 2026 | 4:31 AM

నిమ్జ్ భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు

26-03-2026 12:33 AM

అధికారులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష

సంగారెడ్డి, మార్చి 25(విజయక్రాంతి) : జహీరాబాద్ నిమ్జ్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను అనుసంధానిస్తూ మౌలిక సదుపాయాల ప్రణా ళిక రూపొందించేందుకు సర్వే కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలోని టీజీఐఐసీ భూములు, అలాగే నిమ్జ్, ఎన్‌ఐసీడీసీ పరిధిలోని భూముల అభివృద్ధి, సర్వే ప్రక్రియలపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నిమ్జ్, టీజీఐఐసీ, సర్వే, రెవెన్యూ అధికారులతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు లేఅవుట్ అభివృద్ధి కోసం త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

లేఅవుట్ ప్రకారం రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుత వాతావర ణంలో నిర్వహించేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ముందుగా అవసరమైన విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అనుగుణంగా సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జహీరాబాద్ నిమ్జ్ పరిధిలో భూముల అనుసంధానం, మౌలిక వసతుల ప్రణాళిక రూపొందించడంలో సర్వే కీలకమని మరోసారి స్పష్టం చేశారు.

సర్వే పనులు వేగవంతం చేసేందుకు రెవెన్యూ, సర్వే, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కొలతలతో సర్వే పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా సేకరించిన భూముల ప్రస్తుత స్థితి, పెండింగ్ సమస్యలు, భూ స్వాధీనం ప్రక్రియలో ఉన్న అంశాలను సమీక్షించారు. అడ్వాన్స్ పోజెషన్, భూముల బదిలీ అంశాలపై ప్రత్యేకంగా చర్చించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని నిర్ణయించారు.

పరిశ్రమల అభివృద్ధికి ఆటంకాలు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.