మేడిపల్లి వద్ద పెట్రోల్ లారీ ప్రమాదం
భారీ ట్రాఫిక్ జామ్
108 రాక ఆలస్యం వెంటనే స్పందించిన రిపోర్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్, ప్రవీణ్ – డ్రైవర్‌కు సకాలంలో చికిత్స.
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి కమాన్ వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఓ పెట్రోల్ ట్యాంకర్ లారీ అదుపుతప్పి ఫ్లైఓవర్ పిల్లర్ నం.102ను ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానిక రిపోర్టర్లు చంద్రశేఖర్, శ్రీనివాస్, ప్రవీణ్ వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
అయితే ట్రాఫిక్ అంతరాయం కారణంగా అంబులెన్స్ ఆలస్యమవుతుందని గుర్తించిన వారు మానవతా దృక్పథంతో గాయపడిన డ్రైవర్‌ను స్థానిక అపెక్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ నుంచి ఘట్‌కేసర్, యాదాద్రి, వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించగా, రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.






