25 May, 2026 | 10:32 AM

స్నేహితుల మధుర జ్ఞాపకాల సందడి

25-05-2026 09:42 AM

 గురువులకు సన్మానం

ఘనంగా పేరువంచ పూర్వ విద్యార్థుల స్నేహ సమ్మేళనం 

కల్లూరు,(విజయక్రాంతి): పేరువంచ హైస్కూల్‌లో 1993 నుండి 1996 వరకు పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ గురువులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి గురువులు వేసిన బలమైన పునాదుల వల్లే తాము జీవితంలో స్థిరపడ్డామని పూర్వ విద్యార్థులు గర్వంగా గురువుల ముందు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని గురువుల చేత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం చనిపోయిన గురువులు, తోటి మిత్రుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. 


మండుటెండలను దృష్టిలో ఉంచుకొని అతిథులకు జ్యూసులు అందించగా, అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి ఐస్‌క్రీమ్‌ను కూడా అందించారు. పాటలతో సభ సందడిగా మారింది. ఈ సందర్భంగా ఆనాటి గురువులు కాకర్ల రంగారావు, వెంకటేశ్వర రెడ్డి, వెంకట అప్పారావు, స్థానిక హైస్కూల్ హెచ్ఎం మౌలానా లను శాలువాలతో ఘనంగా సన్మానించి మెమంటోలు అందించారు. కార్యక్రమంలో వణుకూరి ప్రభాకర్ రెడ్డి, పరిమి సీతారాములు, పాశం శ్రీనివాసరావు, చిత్తలూరి నరేష్, అంకిరెడ్డి వెంకటరెడ్డి, జనార్ధన్, అశోక్, నవీన్, రాందాస్, కీసరి ఉమా, రజిత, కృష్ణవేణి, వెంకట నిర్మల, శైలజ, కమలమ్మ, సునీత, కవిత తదితరులు సకుటుంబ సపరివార సమేతంగా హాజరై ఆనందంగా గడిపారు.