1 September, 2026 | 12:45 AM

చుంచుపల్లి ముస్లిం స్మశానవాటికకు అనుమతులు మంజూరు చేయాలి

01-09-2026 12:34 AM

మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా

చుంచుపల్లి, ఆగస్టు 31, (విజయక్రాంతి):  జిల్లాలోని చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ముస్లిం స్మశానవాటిక (కబరస్థాన్) ఏర్పాటుకు గుర్తించిన ప్రభుత్వ భూమికి తక్షణమే అనుమతులు మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ మైనారిటీ సంఘం (Telangana Minority Association) రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కోరారు.

సోమవారం చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. వెంకటేశ్వర కాలనీ, రామాంజనేయ కాలనీ, రామ్నగర్, విద్యానగర్ కాలనీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పేద ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయని, వారికి ప్రత్యేకంగా స్మశానవాటిక లేకపోవడంతో మరణాలు సంభవించిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని యాకూబ్ పాషా తెలిపారు.

ముస్లింలకు స్మశానవాటిక కోసం ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరుతూ 2022 జనవరి 17న ‘డయల్ యువర్ కలెక్టర్’ కార్యక్రమంలో, అదే ఏడాది ఫిబ్రవరి 28న ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించినట్లు చెప్పారు. అనంతరం కొత్తగూడెం ఆర్డీవో ఆర్సీ నంబర్ J/576/2022, తేదీ 30-09-2022 ద్వారా జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.

చుంచుపల్లి తహసీల్దార్ నివేదిక ప్రకారం వెంకటేశ్వర కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 137/1లో సుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో ఎలాంటి ఆక్రమణలు లేని అనువైన ప్రభుత్వ భూమిని ముస్లిం ఖనన వాటిక కోసం గుర్తించినట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన స్థల స్కెచ్ను కూడా అధికారులకు సమర్పించినట్లు తెలిపారు.అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించి నివేదికలు సమర్పించినప్పటికీ, 2022 నుంచి పలుమార్లు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు అనుమతులు మంజూరు చేయకపోవడం బాధాకరమన్నారు.

రెవెన్యూ అధికారులు ఇప్పటికే భూమిని గుర్తించి నివేదిక సమర్పించినందున ఇకపై జాప్యం చేయకుండా సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సర్వే నంబర్ 137/1లో గుర్తించిన ఒక ఎకరం ప్రభుత్వ భూమిపై నిర్ణీత కాలవ్యవధిలో చర్యలు చేపట్టి, తీసుకున్న చర్యలను తెలియజేయాలని ప్రజావాణి నోడల్ అధికారిని కోరారు. 2022 నుంచి పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు ప్రజావాణి వ్యవస్థ ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఆరిఫ్ ఖాన్, హుస్సేన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.