1 March, 2026 | 5:02 AM

ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ

01-03-2026 12:19 AM
  1. బకాయిల వసూలుకు ఓటీఎస్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ
  2. ఈ నెలలో ప్రతి ఆదివారం ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’
  3. అందుబాటులో అన్ని విభాగాల అధికారులు
  4. పన్ను సమస్యలుంటే వెంటనే రండి : కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలకు ఆస్తిపన్ను చెల్లింపులో భారీ ఊరటనిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. దీర్ఘకాలంగా పేరుకుపోయిన పన్ను బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు ని నగరవాసులు తమ పన్ను బకాయిలను క్లియర్ చేసుకోవాలని కోరారు.

పన్ను సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారం కోసం మార్చిలో ప్రతి ఆదివారం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల(మార్చి)లోని అన్ని ఆదివారా ల్లో (1, 8, 15, 22, 29 తేదీలు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది చెప్పారు. సాధారణ పనిదినాల్లో కార్యాలయాలకు రాలేని వారి కోసం ఈ వెసులు బాటు కల్పించామని స్ప ష్టం చేశారు.

ప్రతి సర్కిల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్లు, వా ల్యుయేషన్ అధికారులు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు నేరుగా అందుబాటులో ఉండి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి కేం ద్రంలో కంప్యూటర్లు, ఆన్‌లైన్ సదుపాయం కలిగిన మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించా రు.

ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆస్తి పన్ను అంచనాల సవరణలు, పేరు మార్పులు, రివిజన్ పిటిషన్లు, ఆన్‌లైన్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించిన మొత్తాల నమోదులో తప్పులు, బకాయిల సవరణలు వంటి అన్ని రకాల సమస్యలను పరిష్కరించనున్నారు. ముఖ్యం గా ఐజీఆర్‌ఎస్ అంశాలు, స్వీయ అంచనా సమస్యలు, కోర్టుల్లో పెం డింగ్‌లో ఉన్న పన్ను వివాదాలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. రివిజన్ పిటిషన్లను అత్యవసర ప్రాధాన్యత కింద పరిష్కరించాలని కమిషనర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నగర అభివృద్ధిలో ఆస్తి పన్ను కీలకమని, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ‘పన్నులు చెల్లించండి నగరాభివృద్ధికి సహకరించండి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలో ఏ అధికారి అయి నా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతిరోజూ వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కార వివరాలను గూగుల్ డ్రైవ్ ద్వారా రెవెన్యూ విభాగానికి నివేదించాలని సూచించారు. ఆస్తి పన్ను సమస్యలు ఉన్నవారు అవసరమైన పత్రాలతో తమ పరిధిలోని సర్కిల్ కార్యాలయాలకు హాజరై ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది.