దివ్యాంగులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలి
– ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అహసనుల్లా
ఆర్మూర్,(విజయక్రాంతి): దివ్యాంగ విద్యార్థులకు తరచు వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స చేయించడానికి ఆస్కారం ఉంటుందని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అహసనుల్లా సూచించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఆర్‌బీఎస్‌కే బృందం శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నవిద్యార్థులకు భవిత కేంద్రంలో వారానికి రెండు రోజులు అందించే ఫిజియోథెరపీ వైద్య సేవలను గురించి వైద్యురాలు అరుణ వివరించారు.
అనంతరం వివిధ సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగ విద్యార్థులకు వైద్య బృందం పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసారు. ఇతర పరీక్షలు అవసరం ఉన్న వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించడం కోసం రిఫర్ చేసారు. అనంతరం సదరం సర్టిఫికేట్, యూడీఐడీ కార్డులు లేని దివ్యాంగ విద్యార్థులతో పాటు ఆసరా పింఛన్ రాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. వారు పేర్కొన్న సమస్యలన్నింటినీ నమోదు చేసుకొని జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు.
సమస్యలను వెంటది వెంట పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ సిద్దంగా ఉన్నారన్నారు. ఫిజియోథెరపీ సేవలను నిరంతరం కొనసాగించడంతో పాటు ఇంటి వద్ద తల్లిదండ్రులు దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు. అదేవిధంగా స్పీచ్ థెరపీ అవరసం ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతలు నిర్వహించాలన్నారు. ఆర్‌బీఎస్‌కే బృందంలో ఫార్మసిస్టు సుమలత, ఏఎన్‌ఎం వసంత ఉన్నారు. భవిత కేంద్రంలో ఐఈఆర్పీలు కిషన్, సురేష్, సీజీవీ కవిత ఉన్నారు.




