కళాకారుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
హుజురాబాద్,(విజయక్రాంతి): మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ కళాకారుల బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా హుజరాబాద్ పట్టణంలో తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పాత బిల్లులు చెల్లించకుండానే పంద్రాగస్టు కార్యక్రమాలకు కళాకారులను ఆహ్వానించడం సరికాదన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, జాతరలు, ఉత్సవాల్లో కళా ప్రదర్శనలు ఇస్తూ తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్న కళాకారుల కుటుంబాలు బకాయిల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు కళా సంఘాలు చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రకటించాలని కోరారు. ఈ నెలలోపే పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని, భవిష్యత్తులో కార్యక్రమం పూర్తయిన నిర్దిష్ట గడువులోనే పారితోషికాలు చెల్లించే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కళాకారులకు పెన్షన్లు అందించి ప్రభుత్వం భరోసా కల్పించాలని బండ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.






