9 March, 2026 | 11:46 PM

నల్ల రిబ్బన్‌లతో సమగ్ర శిక్ష సిబ్బంది నిరసన

09-03-2026 09:42 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ వేతనాలు చెల్లించడంతో పాటు గత సంవత్సరం 29 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సీ) ఆసిఫాబాద్‌లో సమగ్ర శిక్ష సిబ్బంది నల్ల రిబ్బన్‌లు ధరించి సోమవారం నిరసన తెలిపారు.

TSUTF ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ నిరసన చేపట్టినట్లు సిబ్బంది తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తమ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

అలాగే సమ్మె సమయంలో చేసిన డిమాండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన 29 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలు కూడా ఇప్పటివరకు చెల్లించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో ఎంఐఎస్ సంతోష్, అనూప్ (సీసీఓ), వెంకటరమణ (ఐఈఆర్‌పీ), సీఆర్‌పీలు తిరుపతి, సుభాష్, నగేష్, మెస్సెంజర్ సంతోష్, కవిత తదితర సిబ్బంది పాల్గొన్నారు.