పోరాటాలతోనే దోపిడీ వ్యవస్థ అంతం
- ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ
గరిడేపల్లి,(విజయక్రాంతి): పోరాటాలతోనే సమాజంలో దోపిడీ వ్యవస్థ అంతమవుతుందని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య,మేకల కనకారావు అన్నారు.మండలంలోని వెలిదండ గ్రామంలో బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. దోపిడీ, పీడన లేని సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడడమే విప్లవ పార్టీల ప్రధాన లక్ష్యమని పిలుపునిచ్చారు.
పీడిత ప్రజల పక్షాన, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1969లో ఈ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. రష్యా విప్లవ వీరుడు కామ్రేడ్ లెనిన్ జయంతి రోజే ఈ పార్టీ పురుడు పోసుకోవడం వెనుక బలమైన విప్లవ ఆశయాలు ఉన్నాయని, ఈ ప్రయాణంలో ఎందరో అమరుల త్యాగాలు దాగి ఉన్నాయని వారు కొనియాడారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, సామాన్య ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు.దేశంలో లౌకికత్వాన్ని తుంగలో తొక్కి,మత విద్వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.
అదేవిధంగా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని,రేవంత్ సర్కార్ మాటలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.ప్రభుత్వం మొండివైఖరి వీడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మొదట పార్టీ పడ్డాకాన్ని గ్రామ పార్టీ కార్యదర్శి మేకల కనకారావు ఆవిష్కరించారు.కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కామల్ల నవీన్,అరుణోదయ నాయకులు గండు నాగేష్,చనగాని సాంబయ్య,చింతమళ్ళ అంజయ్య,కామల్ల శ్రీను,పోటు శ్రీహరి,సిహెచ్ లక్ష్మయ్య,జిలకర ముత్తయ్య,కోటయ్య,బిక్షం తదితరులు పాల్గొన్నారు






