సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం
హైదరబాాద్: సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం(Parliamentary Standing Committee Meeting) నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(cm Revanth Reddy), కమిటీ చైర్ పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్ లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాలని సూచించారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని ఆదేశించారు.హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని వివరించారు. అండర పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవల్ విధానాన్ని తీసుకురావాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని తెలిపారు. మల్టీ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పార్కింగ్ ఇబ్బందులు అధిగమించేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని 3 భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్యూర్, ప్యూర్, రెర్ గా అభివృద్ధిని 3 భాగాలుగా విభజించుకొన్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు క్యూర్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ బయట, ఆర్ఆర్ఆర్ లోపల ఉన్న ప్యూర్ ఏరియాను తయారీ రంగంగా గుర్తించామని తెలిపారు. ఆర్ఆర్ఆర్ బయట ఉన్న రెర్ ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్ గా గుర్తించామని వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించుకున్నామని సూచించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హైదరాబాద్ లో ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.






